22-ఏ నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి
31న సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ మహాధర్నా
సిద్దిపేట రూరల్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రైతుల పట్టా భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 31న ఉదయం 10 గంటలకు సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. శనివారం సిద్దిపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు అన్నసరం సురేష్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల ప్రభారి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్లేపురెడ్డి రజినీకర్‌రెడ్డి మాట్లాడారు.
మహాధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఎంపీలు మాధవనేని రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్ హాజరవుతారని తెలిపారు. రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్తినేని రాజు, మండల ప్రధాన కార్యదర్శి బోయిని సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు పరకాల తిరుపతిరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బైతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






