23 June, 2026 | 4:02 AM

నేనేమి చేశాను పాపం..?

23-06-2026 01:14 AM

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. బిల్లు రిజెక్ట్ చేశారు

అప్పు చేసి ఇల్లు నిర్మించిన ఒంటరి మహిళ ఆవేదన

అధికారుల విచారణ లోపమే కారణమా..?

బెజ్జూర్, జూన్ 22 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుకపల్లి గ్రామానికి చెందిన చెన్నం పోచక్క అనే నిరుపేద మహిళ ఇందిరమ్మ ఇల్లు బిల్లు నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి బేస్మెంట్ పనులు పూర్తి చేసినప్పటికీ, అనంతరం తన పేరును ఆన్లైన్ జాబితా నుంచి తొలగించారని ఆమె వాపోయారు.

బాధితురాలు తెలిపి న వివరాల ప్రకారం ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో అప్పు చేసి పనులు చేపట్టారు.బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేశారు.ఈ క్రమంలో కుటుంబ సభ్యుల శుభకార్యానికి మహారాష్ట్రకు వెళ్లాల్సి వచ్చింది. అనుకోకుండా భర్త మల్లయ్య అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు, కర్మకాండల కారణంగా కొంతకాలం మహారాష్ట్రలోనే ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎలుకపల్లి గ్రామంలో తాను నివాసం ఉండడం లేదని కొందరు చెప్పిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, సంబంధిత అధికారులు సరైన విచారణ చేపట్టకుండా తన పేరును ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని పోచక్క ఆరోపించారు. గ్రామంలోనే తనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పింఛన్ తదితర ప్రభుత్వ గుర్తింపులు ఉన్నప్పటికీ, తాను గ్రామంలో నివసించడం లేదనే కారణంతో అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లు అందక ఆర్థికంగా కుంగిపోయానని పోచక్క కన్నీటి పర్యంతమయ్యారు. మండల కార్యాలయాల చుట్టూ తిరిగి పలుమార్లు అధికారులను వేడుకున్నప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.గ్రామస్థులు కూడా పోచక్కకు అన్యాయం జరిగిందని, పూర్తి స్థాయి విచారణ లేకుండానే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, బాధిత మహిళకు న్యాయం చేసి, ఇందిరమ్మ ఇంటి బిల్లులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, బాధితురాలు విజ్ఞప్తి చేస్తున్నారు.