డీటీవోను బలిగొన్న బొగ్గు లారీ
- విధి నిర్వహణలో ఉన్న వెంకన్నపై దూసుకెళ్లిన వాహనం.. అక్కడికక్కడే మృతి
- భూపాలపల్లి జిల్లా చెల్పూరులో ఘటన
జయశంకర్ భూపాలపల్లి/ మహబూబాబాద్, జూన్ 22 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9.30 గంటల సమయంలో రవాణా కార్యాలయం ఎదుట డీటీవోను బలిగొన్న బొగ్గు లారీ జిల్లా రవాణా అధికారి (డీటీవో) మద్దో జు వెంకన్న (48) సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి అతనిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలై అక్కడిక క్కడే మృతి చెందాడు.
పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. ఎస్పీ సంకీర్త్, కలెక్టర్ రాహుల్‌శర్మ ఆస్పత్రికి వెళ్లి వెంకన్న మృతదేహాన్ని సందర్శించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
బదిలీపై వచ్చిన 20 రోజులకే..
మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన వెంకన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌గా రవాణా శాఖలో చేరారు. 20 రోజుల క్రితం జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. కలెక్టరేట్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకన్న మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇసుక, బొగ్గు మాఫియాకు అడ్డొస్తే చంపిస్తారా?: హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై మాజీ మంత్రి హరీశ్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాకు అడ్డస్తే లారీతో తొక్కించి చంపిస్తారా? అని ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు స్పందించారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని, డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.






