14 June, 2026 | 1:45 AM

ఏ యాత్ర చేసినా ఎవరూ నమ్మరు

14-06-2026 12:22 AM

కేటీఆర్, కేసీఆర్, హరీష్‌రావులకు జనం కర్రుకాల్చి వాతపెట్టారు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): బస్సుయాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్ బస్సు యాత్ర చేసినా, హరీష్ రావు మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్ దాటలేదని, ఫామ్ హౌస్ ను వదిలిపెట్టలేదని, అధికారం పోయాక బస్సు యాత్ర చేస్తే కేసీఆర్‌ను ఎవరు నమ్ముతారని నిలదీశారు.

ఆనాడు ఒక్క రోజు ప్రజల ను కలిసింది లేదని, అందుకే జనం కర్రు కాల్చి వాత పెట్టారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ పోర్లు దండాలు పెట్టినా, వెక్కి వెక్కి ఏడ్చినా జనం నమ్మరని అన్నారు. కాంగ్రెస్‌కు మూడో స్థానం వస్తుందని ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు నీకు ప్రజలు ఏ స్థానం ఇచ్చారో తెలుసుకోవాలని హితవు పలికారు.

గుండు సున్నా వచ్చినా సిగ్గురావడం లేదని, పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసిందన్నారు. భవిష్యత్తులో నీ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరని జోస్యం చెప్పారు. వంద స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీకి తమతో పో టీ ఉంటుందని కేటీఆర్ అంటున్నారని, దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ఇట్టే అర్థమవుతున్నాయని చెప్పారు. ప్రజలు మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి పట్టం కట్టడం ఖాయ మని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తుంది

వేములవాడ: వేములవాడలో బీఆర్‌ఎస్ నిర్వహించిన సభ అబద్ధాల ప్రచార వేదికగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. శనివారం మీడియాతొ మాట్లాడు తూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, వాటిని వింటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తుండగా, బీఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

వరద కాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టు వంటి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై బీఆర్‌ఎస్ సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడలో రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కాళికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.