4 May, 2026 | 4:34 AM

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

04-05-2026 03:10 AM
  1. నీట్ పరీక్షకు 911 మంది అభ్యర్థుల హాజరు
  2. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సజావుగా ముగిసిన నీట్ పరీక్ష

గద్వాల టౌన్, మే 3 : జోగులాంబ గద్వాల జిల్లాలో నీట్ పరీక్షను ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలలతో పాటు బాలుర, బాలికోన్నత పాఠశాలలలో మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్షను సజావుగా నిర్వహించారు. మొత్తం 930 మంది అభ్యర్థులకు గాను 911 మంది పరీక్షకు హాజరైనట్లు నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించగా అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తమ పోలీసు బృందంతో ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును నియమించారు.

బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నీట్ పరీక్షను విజయవంతం చేసినట్లు ఈ సందర్భంగా సిటీ కోఆర్డినేటర్ తెలిపారు. అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, ముఖ్య పర్యవేక్షకులు వీరన్న, కృష్ణ, జహీరుద్దీన్, రేణుకా దేవి, పరిశీలకులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, తదితరులు పరీక్షను సజావుగా నిర్వహించేందుకు విధులు నిర్వహించారు.