మంద స్వామిదాస్‌కు నేషనల్ ఎడ్యుకేటర్ ఐకాన్ అవార్డు
ఘట్కేసర్, జూలై 19 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు, విద్యావేత్త మంద స్వామిదాస్ కు నేషనల్ ఎడ్యుకేటర్ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ సినీ నటుడు డాక్టర్ పృథ్వీరాజ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
గత 20 సంవత్సరాలుగా శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యకు దూరమైన బాల కార్మికులు, పేద, నిరుపేద విద్యార్థులను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు పుస్తకాలు, దుస్తులు పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేష సేవలందిస్తున్నందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాది మంది నిరుపేద విద్యార్థులకు విద్య అందించేందుకు, బాల కార్మికులను విద్యా వ్యవస్థలోకి తీసుకురావడానికి స్వామిదాస్ చేసిన కృషిని గుర్తించి ఈ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంద స్వామిదాస్ మాట్లాడుతూ విద్య ఎవరి సొత్తు కాదని, విద్యతో దుర్భిక్షాన్ని జయించవచ్చని, విద్యను కేవలం ఉద్యోగాలకే పరిమితం చేయకుండా ఉపాధి, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవకు కూడా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ పట్నం కమల్ మనోహర్, పట్నం సుజాత, రవీందర్, వెంకటేష్, మాధవీలత, కేబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






