15 July, 2026 | 1:13 PM

Breaking News

డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •  

'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష

15-07-2026 12:55 PM
  1. భీంగల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
  2. ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షకు భయమెందుకు?: 
  3. పోలీసుల పహారాలో స్వగృహంలోనే దీక్ష కొనసాగింపు
  4.  పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట తప్పారు.. కాంగ్రెస్ హామీలు ఉత్త మూటలే
  5. భీంగల్ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదు
  6. ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అల్టిమేటం

భీంగల్: బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి(Bheemgal Town Development) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్షకు పూనుకున్న బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని(MLA Vemula Prashanth Reddy House Arrest) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని వేముల ప్రశాంత్ సూటిగా ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షల నడుమ ఆయన బుధవారం తన స్వగృహంలోనే నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లపై  తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) భీంగల్ ప్రజల వైద్య అవసరాల కోసం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన 20-25 శాతం పనులను పూర్తి చేయాలని గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో, భీంగల్ వేదికగా అనేక పోరాటాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  ఆరోపించారు. అలాగే, గతంలో తమ ప్రభుత్వం భీంగల్ కు తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని, దానిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో భీంగల్ సీసీ రోడ్ల కోసం రూ. 12 కోట్లు మంజూరు చేశామని, అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల(Municipal elections) సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల లబ్ధి కోసం తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలుపెట్టారని విమర్శించారు. నేటికీ ఆ పనులు పూర్తి కాలేదని, రోడ్లపై కంకర వేసి వదిలేశారని, కనీసం డాంబర్, సీసీ రోడ్లు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. భీంగల్ మార్కెట్ పనులు(Bheemgal market works) కూడా  ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నాలుగు ప్రధాన డిమాండ్ల సాధనకై తాను భీంగల్ లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చానని, దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు (CP, ACP, SHO) ముందస్తు సమాచారం ఇచ్చామని వివరించారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ, బుధవారం వేకువజామునే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. భీంగల్ లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజిని తొలగించడమే కాకుండా, ప్రజలు, కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను సైతం పోలీసులు చించివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, తన ఇంట్లోనే సాయంత్రం వరకు దీక్షకు దిగారు.

  1.  పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట తప్పారు.. కాంగ్రెస్ హామీలు ఉత్త మూటలే

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) భీంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను వేముల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మూడు నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు, ఐదు నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహేష్ గౌడ్ మాట తప్పారని ఫైర్ అయ్యారు. కనీసం ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రభుత్వం తరపున వచ్చి ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి ఉంటే తాను దీక్షను విరమించుకునే వాడినని, ప్రజల పక్షాన తనను తాను శిక్షించుకుంటూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఉలుకు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని మండిపడ్డారు. భీంగల్ లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించే వరకు, మార్కెట్, అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని  మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఈ న్యాయమైన పోరాటంలో బాల్కొండ నియోజకవర్గ, భీంగల్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.