ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్
నిజామాబాద్: బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని(Vemula Prashanth Reddy) నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించడాన్ని భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వివిధ ప్రాంతాల్లో గృహ నిర్బంధంలో ఉంచారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిరాహార దీక్షలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు, అదుపులోకి తీసుకున్న నాయకులు, కార్యకర్తలను ఆ తర్వాత వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధంపై KTR ఆగ్రహం
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధంపై(Vemula Prashanth Reddy house arrest) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్ అభివృద్ధి, 100 పడకల ఆస్పత్రి, ఆర్టీసీ డిపో కోసం ప్రశాంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే, ప్రజల తరఫున ప్రశ్నించే ఎమ్మెల్యేను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే అన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
ప్రతిపక్షాన్ని అణచివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందన్న కేటీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇందిరా ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చారని సూచించారు. వేల్పూర్‌లో ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు దురదృష్టకరమన్నారు. శాంతియుత నిరసన కూడా అనుమతించని ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారిందని ఫైర్ అయ్యారు. పోలీసుల వెనుక దాక్కుని పాలన సాగించడం రేవంత్ కు అలవాటు గా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హిట్లర్, ఇందిరా గాంధీ తరహా నియంతృత్వ ధోరణిని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని విమర్శించారు. వేముల ప్రశాంత్ రెడ్డి అక్రమ గృహనిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కక్షసాధింపు రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.






