15 July, 2026 | 12:25 PM

ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి

15-07-2026 12:18 PM

కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కాగజ్‌నగర్ మండలంలోని ఈజీగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా సిబ్బంది హాజరు రిజిస్టర్, విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మందుల నిల్వ గది, స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు.వైద్యం కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి సరైన చికిత్స అందుతుందా, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో సీజనల్, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు.ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.