15 July, 2026 | 12:32 PM

Breaking News

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి

15-07-2026 12:25 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): జర్నలిస్టుల పిల్లల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారి చదువులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బూర్గంపాడు మండల విద్యావనరుల కేంద్రంలో  టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు జేవి రత్నం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ నాయకులు మండల విద్యాశాఖ అధికారి యదు సింహారాజుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సమాచారాన్ని అందించే క్రమంలో జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న విద్యా ఖర్చుల కారణంగా జర్నలిస్టుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.వినతి పై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి యదు సింహారాజు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.త్వరలోనే మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బర్ల జోషి, జిల్లా ఉపాధ్యక్షులు డొంకన చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ సహాయ కార్యదర్శి సాంబరెడ్డి, నియోజకవర్గ ఆర్గనైజింగ్ మెంబర్ నరసింహారెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు శివకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా ఈసీ సభ్యులు రవి, సభ్యులు జక్కిరెడ్డి మల్లారెడ్డి, డి శ్రీనివాస్, కోటా రమేష్, రాంబాబు, చేతుల శ్రీనివాస్, సుధాకర్, ముజఫర్, కేసుపాక రాజు, తదితరులు పాల్గొన్నారు.