కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తులం బంగారం ఎప్పుడు? – ఎమ్మెల్యే తలసాని ప్రశ్న
సనత్ నగర్,(విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్ (61), అమీర్ పేట(7), ఖైరతాబాద్ (14), ముషీరాబాద్ (13) మండలాల పరిధిలోని 95 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు చెక్కులను అందుకుంటూ తులం బంగారం ఇస్తామన్నారు కదా... ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పక్కనే ఉన్న సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ ను సమాధానం చెప్పండి అని అడిగారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు అవుతున్నా నేటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు.
తులం బంగారం కోసం అనేకమంది లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, తహసీల్దార్ లు పాండు నాయక్, ప్రేమ్ కుమార్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు శ్రీహరి, అశోక్ యాదవ్, కిషోర్, కొండాపురం మహేష్ యాదవ్, ఆరీఫ్, ప్రేమ్, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, జయరాజ్, లక్ష్మీపతి, శేఖర్, కూతురు నర్సింహ, అబ్బాస్, వనం శ్రీనివాస్, శంకర్ తదితరులు ఉన్నారు.




