5 August, 2026 | 9:17 PM

నాలాల్లో పూడికతీత చేపట్టాలి

05-08-2026 08:06 PM

- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

- చంపాపేట డివిజన్ న్యూ పద్మా నగర్ కాలనీ పర్యటన

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బాక్స్ డ్రైన్, నాలాలు, వరద కాలువలు, డ్రైనేజీ పైప్ లైన్లలో పూడికతీత పనులు పూర్తి చేసి, ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని న్యూపద్మానగర్ కాలనీలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా బాక్స్ డ్రెయిన్ల నుంచి వరద పొంగిపొర్లి సమీపంలోని ఇండ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బుధవారం న్యూ పద్మా నగర్ కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించారు.

వంగ శంకరమ్మ ప్రాంతం నుంచి నిర్మించిన నూతన బాక్స్ డ్రైన్ పనులు పూర్తయ్యాయని, కానీ డ్రైన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం, అలాగే నిర్మాణ సమయంలో ఉపయోగించిన ఇసుక బస్తాలు, సెంటరింగ్ సామగ్రిని తొలగించకపోవడంతో వరద  ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నీరు ఇండ్లలోకి చేరిందని స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అన్ని బాక్స్ డ్రెయిన్లను వెంటనే తెరిచి పూడిక, చెత్తాచెదారం, నిర్మాణ సామగ్రిని తొలగించి వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

న్యూ పద్మా నగర్‌తో పాటు పరిసర కాలనీల్లో వరద సాఫీగా పోయేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు , స్థానికులు రాజిరెడ్డి, కృష్ణమాచారి, గండికోట శ్రీనాథ్, సదానంద రెడ్డి, రవి ముదిరాజ్, ఉమామహేశ్వర్, శివ, జగదీష్, సురేందర్ రెడ్డి, వసంత, వసంత్, రాజశేఖర్ రెడ్డి, అల్లంపల్లి శ్రీనివాస్, జయవర్ధన్ రెడ్డి, విజయానంద్ రెడ్డి, శ్రీను యాదవ్, శ్రీనుపంతులు, యాదయ్య, సుధాకర్ రెడ్డి, నరహరి రావు తదితరులు పాల్గొన్నారు.