గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో "ఎం ఎల్ ఏ విద్యాయాత్ర
మన ఎం ఎల్ ఏ – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జారే
దమ్మపేట,(విజయ క్రాంతి): మండల పరిధి గండుగులపల్లిలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను (ఇ ఎం ఆర్ ఎస్ ) అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా నేను సైతం చేయూత, విద్యా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎం ఎల్ ఏ విద్యాయాత్ర - మన ఎం ఎల్ ఏ మన బడి అనే నూతన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పాఠశాలలో పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే పాల్గొని మాట్లాడారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలమని, డ్రగ్స్ రహిత అశ్వారావుపేట నిర్మాణానికి ప్రతీ విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం చీకటిమయం అవుతుందని హెచ్చరిస్తూ, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి లక్ష్యాలు, చదువు, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని, విద్యా ప్రమాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే తరగతి గదులు, హాస్టల్, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతులను తనిఖీ చేశారు. విద్యార్థులకు నిరంతరం నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులను , ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆత్మీయంగా టిఫిన్ చేస్తూ వారి సమస్యలు, చదువు విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇదప్ప, దమ్మపేట మండల రెవిన్యూ అధికారి ( అండర్ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టరు) మద్దినేని మురళి, ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, ఎంఈఓ జగపతి రావు, సిఐ నాగరాజు, ఎస్ ఐ రాజేష్, మాజీ సర్పంచ్ మడకం రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాక రమేష్, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






