అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మడికొండ సుమన్ (35) అదృశ్యం ఉదంతం విషాదాంతమైంది. గత కొన్ని రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన సుమన్, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి శివారులోని ఫుట్ ఫారం గ్రామ పొలాల్లో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నిందితులు సుమన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరకకుండా శవాన్ని కాల్చివేసినట్లు సమాచారం.
పరకాలలోని సిఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ ఈ నెల 3వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో, ఈ నెల 8వ తేదీన సుమన్ తండ్రి పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..మృతుడు సుమన్‌కు రేగొండ మండలం రావులపల్లికి చెందిన లావణ్యతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు పింకి (13), చిట్టి (8) ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే గత నెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ కేంద్రంలో సుమన్‌ను అతని బావ (లావణ్య సోదరుడు) పెండ్యాల రాజు కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడనే ఆరోపణలున్నాయి. కాగా సుమన్ అదృశ్యంపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మృతుడి భార్య లావణ్యతో పాటు ఆమె సోదరుడు రాజు, వంగపల్లికి చెందిన నరేష్‌లను అనుమానితులుగా అదుపులోకి తీసుకొని విచారించగా, సుమన్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు వారిచ్చిన సమాచారం మేరకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి శివారు ఫుట్ ఫారం గ్రామ పంట పొలాల్లో మృతదేహాన్ని తగలబెట్టినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






