10 August, 2026 | 1:12 PM

VijayaKranthi Effect: నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్‌, డ్రైవర్లపై కఠిన చర్యలు

10-08-2026 12:03 PM

ప్రైవేట్‌ అంబులెన్స్‌లు,డ్రైవర్ లకు ఆస్పత్రి గేటులోకి అనుమతి లేదు

కేవలం ప్రభుత్వ అంబులెన్సులు,108 వాహనాలకు అనుమతులు

అంబులెన్స్‌ సేవలు రోగుల ప్రాణాలను కాపాడాలి కానీ కమిషన్ ల కొరకు కాదు

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్

బాన్సువాడ, ఆగస్టు 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల కమీషన్‌ దందాపై సోమవారం విజయ క్రాంతి ఎడిషన్ లో ప్రచురితమైన కథనానికి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా విజయ క్రాంతి తో ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లోకి కేవలం ప్రభుత్వ అంబులెన్స్ లు, 108 వాహనాలకు మాత్రమే ఆసుపత్రి  గేటు లోపలికి అనుమతులు ఉన్నాయని,ప్రైవేట్‌ అంబులెన్స్‌ లు, డ్రైవర్లకు ఆసుపత్రి గేటులోకి ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్‌,డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అత్యవసర సమయంలో అంబులెన్స్‌ సేవలు రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడాలని, కమిషన్ ల కొరకు కాదు అని ఆయన సూచించారు.కమీషన్ల ఆరోపణలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రిలకు కమిషన్ల కొరకు తీసుకువెళ్లే డ్రైవర్ల పై సిబ్బందిపై ప్రత్యేక నిఘా పెడతామని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఆసుపత్రి ఆర్ ఎం ఓ, సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన అన్నారు. అదేవిధంగా మరో రెండు మూడు రోజుల్లో గా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన మూడు శాంపిల్స్ రిపోర్ట్ రానుంనదని ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ తిరిగి ప్రారంభించి త్వరలోనే కాన్పులు చేయడం ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేద ప్రజలు, రోగులకు మెరుగైన సేవలు అందే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.