16 August, 2026 | 4:33 AM

మిలటరీ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి

16-08-2026 12:00 AM

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కి  స్తున్న సంగతి తెలిసిందే. ‘వెంకీ అనిల్ 5’, ‘ఎన్‌కేఆర్ 2’ అనే వర్కింగ్ టైటి ల్స్‌తో ప్రచారంలో ఉన్న భారీ వినోదాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి కళ్యాణ్‌రామ్ పుట్టిన రోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.

ఇక తాజాగా విక్టరీ వెంకటేశ్ ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇండస్ట్రీలో వెంకటేశ్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేశ్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ లుక్ చూస్తే వెంకటేశ్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని అర్థమవుతోంది. పోస్టర్‌లో వెంకటేశ్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు.

ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా కాగా, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్ పనిచేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.