అగ్నికీలల బీభత్సం..
ఇంచెంచెర్వుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
అగ్నికి ఆహుతైన వరి, మోటార్లు, పైపులు
వెంకటాపూర్, మే 28 (విజయక్రాంతి): మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తుల నిర్లక్ష్య చర్యలతో గ్రామ శివారులో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి వందల ఎకరాల వ్యవసాయ భూములను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ ప్రమాదంలో ఐదు ఎకరాల వరి పంట పూర్తిగా దగ్ధమవగా, మూడు బోర్ మోటార్లు, పైపులు, వందల సంఖ్యలో వరిగడ్డి కట్టలు మంటల్లో కాలిపోయాయి.
మంటలు గ్రామం వైపు వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమయానికి అప్రమత్తమైన విలేజ్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ కామా అశోక్ వెంటనే పోలీసులకు, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామ యువకులు, రైతుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామస్తులు సమయానికి స్పందించి సహకరించకపోయి ఉంటే మరింత భారీ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.






