పస్రా, మేడారం రోడ్డుపై పోలీసుల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు!
గోవిందరావుపేట,ఆగస్టు 28 (విజయక్రాంతి): పండగ చేసుకోండి.. ప్రాణాలతో చెలగాటం మాత్రం ఆడొద్దు.. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పసర ఎస్ ఐ తాజుద్దీన్ పేర్కొన్నారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్(Mulugu District SP Sudheer Ramnath Kekan) ఆదేశాల మేరకు, ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ సూచనలతో, పస్రా సీఐ పీ. దయాకర్ పర్యవేక్షణలో పస్రా ఎస్ ఐ ఎస్.కె. తాజుద్దీన్, తాడ్వాయి ఎస్ ఐ కే. జగదీష్ గౌడ్, నర్లాపూర్/మేడారం ఎస్ ఐ ఎ. కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం మేడారం రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలతో చెలగాటమని, ఒక్కరి నిర్లక్ష్యం వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని పోలీసులు హెచ్చరించారు. యువత ముఖ్యంగా మద్యం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, జీవితాన్ని నాశనం చేసే అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. పండుగలను ఆనందంగా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యం
పండుగల సమయంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. వాహనదారులు అత్యుత్సాహానికి వెళ్లకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ఇతరుల ప్రాణాలను కూడా ఉప్పు ముప్పు కలగకుండా ప్రయాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని పోలీసులు అవగాహన కల్పించారు.






