మంథనిలో శర్మల ఆధ్వర్యంలో ఘనంగా నూతన యజ్ఞోపవీత ధారణ
వేదమంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం నిర్వహించిన అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ
మంథని, ఆగస్టు 28 (విజయక్రాంతి): మంథని పట్టణంలో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు జరిగాయి. తమ్మి చెరువుకట్ట వీధిలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వేద పండితులు అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులకు సంప్రదాయ పద్ధతిలో నూతన యజ్ఞోపవీతాలను ధరింపజేశారు.
యజ్ఞోపవీతానికి హిందూ సంప్రదాయంలో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ తెలిపారు. మూడు పోగులతో బ్రహ్మముడి వేసి రూపొందించే యజ్ఞోపవీతాన్ని ధార్మిక కార్యక్రమాల్లో పవిత్రంగా ఉపయోగిస్తారని వివరించారు. హిందూ సంప్రదాయంలో దారపు పోగులకు ప్రత్యేక స్థానం ఉందని, వ్రతాలు, తోరణాలు, మంగళసూత్రం వంటి శుభకార్యాల్లో కూడా వాటిని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా రక్షాబంధన్ పర్వదినాన్ని కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు, భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.






