26 June, 2026 | 5:37 PM

మత్తుకు బానిసైన వారికి పోలీసుల అండ

26-06-2026 04:39 PM

* డీ-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్

* బాధితుల్లో మానసిక ఉల్లాసం కోసం ఆటవస్తువుల అందజేత

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మత్తు పదార్థాల మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్యం, ఇస్తున్న కౌన్సెలింగ్ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా డీసీపీ బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మత్తు అలవాట్లను దూరం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సౌజన్యంతో బాధితుల మానసిక వికాసానికి, ఉల్లాసానికి తోడ్పడే క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు తదితర ఆటవస్తువులను పంపిణీ చేశారు.