కోనరావుపేటలో ఘనంగా మొహర్రం వేడుకలు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో మొహర్రం పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రామంలో మొహర్రం వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించగా, ముస్లిం సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పీర్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు సందర్భంగా దప్పు చప్పుళ్లు, వివిధ వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు.గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పీర్ల దర్శనం చేసుకున్నారు. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండుగ నిర్వహణలో గ్రామ యువత, ఉత్సాహంతో పాల్గొన్నారు. మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు కోనరావుపేటలో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ముస్లిం సోదరులతో పాటు హిందూ, ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా వేడుకల్లో పాల్గొని పరస్పర ఐక్యతను చాటారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






