త్యాగానికి, సత్యానికి ప్రతీక మొహర్రం
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జామియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్, మైనార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ మొహర్రం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది త్యాగానికి, సత్యానికి, ధర్మానికి ప్రతీక అని కొనియాడారు. లోకకళ్యాణం కోసం, సమాజంలో శాంతిని నెలకొల్పడం కోసం హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. కులమతాలకు అతీతంగా, సోదరభావంతో అందరూ కలిసిమెలిసి జీవించడమే మొహర్రం పండుగ యొక్క అసలైన సందేశమని ఆయన పేర్కొన్నారు.






