ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ఫకీర్ నాయక్ తండాలో విషాద ఛాయలు
సిరికొండ,(విజయక్రాంతి): ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సిరికొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై భూపెల్లి విక్రమ్ , స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఫకీర్ నాయక్ తండాకు చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ తండ్రి జాదవ్ ప్రకాష్ (28) కల్టివేటర్ రిపెరు కోసం ట్రాక్టర్ పట్టుకొని ఫకిర్ నాయక్ తండ నుంచి సిరికొండ వెళ్తుండగా లెండిగూడ బ్రిడ్జి వద్ద గుంతలు ఉండడంవల్ల తాను నడుపుతున్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బ్రిడ్జి కింద బోల్తాపడింది.
ప్రమాద సమయంలో ట్రాక్టర్ కింద చిక్కుకున్న జ్ఞానేశ్వర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు తో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. జ్ఞానేశ్వర్ మృతితో ఫకీర్ నాయక్ తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.






