ఎన్నికల అధికారులు పారదర్శకంగా పనిచేయట్లేదు: ఖర్గే
పారదర్శకమా..?.. ప్రజాస్వామ్యమా..? కేంద్రం జవాబివ్వాలి: ఖర్గే
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు(Rajya Sabha elections) తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు ప్రశాంత్ కుమార్ మిశ్రా, అతుల్ ఎస్ చందుర్కర్‌లతో కూడినసుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress president Mallikarjun Kharge) స్పందించారు.
అధికారులు ప్రజాస్వామ్యం, నిబంధనలు ఏమీ పాటించట్లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో ఎవరినైనా తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఝార్ఖండ్ లో ఒక అభ్యర్థి విషయంలో పక్షపాతంగా వ్యవహిరించారని ఖర్గే సూచించారు. పదవి, పిల్లల సంపద విషయం కూడా అభ్యర్థి నమోదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆ అభ్యర్థికి మరింత సమయం ఇచ్చి నామినేషన్ కు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకమా? .. ప్రజాస్వామ్యమా? కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారుల పారదర్శకంగా పనిచేయట్లేదని నిరూపితమవుతోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ ఘటనలే కేంద్ర పారదర్శకతకు నిదర్శనం అన్నారు. ఎన్నికల నిబంధనలు, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కేంద్రాన్ని ఖర్గే కోరారు.
కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు. "ముందుగా ఎన్నికల కమిషన్‌ను, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి, ఆపైనే సుప్రీంకోర్టుకు రావాలన్నది వాళ్ల వాదన. అయితే, ఇది ఒక ప్రత్యేకమైన కేసు. ఎంత ఎక్కువ సమయం ఇస్తే, ఈ వ్యవహారం అంతగా సాగుతూనే ఉంటుంది. అందుకే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించాలని మేము కోరుకున్నాము. ఏది ఏమైనప్పటికీ, కోర్టు అలా సూచించినందున, మేము తదనుగుణంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. ఈ తిరస్కరణ చట్టవిరుద్ధం, అనైతికం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని మేము భావిస్తున్నాము. ప్రభుత్వం చేసిన పని తప్పు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం లేకుండా ఇలాంటి కీలక చర్యలు జరగవు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న పెద్ద కుట్రలో భాగంగానే ఈ చర్యలు ఉద్దేశపూర్వకంగా తీసుకుంటున్నారని మేము భావిస్తున్నాము. మా దృష్టిలో, ఈ చర్యలన్నీ ప్రతిపక్షాన్ని వేధించడానికి, అణచివేయడానికి ఉద్దేశించినవి." అని ఖర్గే ఆరోపించారు.






