సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ: మీనాక్షి నటరాజన్ పిటిషన్(Meenakshi Natarajan petition dismissed)పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయ స్థానం మీనాక్షి నటరాజన్ కు షాకిచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి తన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
పిటిషన్ విచారణకు అర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. RO తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. నామిషనేషన్ తిరస్కరిస్తే ఈసీని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎ.ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం, ఆర్టికల్ 329 ప్రకారం రాజ్యాంగపరమైన నిబంధన ఉందని పేర్కొంటూ, తమ రిట్ అధికార పరిధిని వినియోగించడానికి నిరాకరించింది. తదనుగుణంగా, రిట్ పిటిషన్ విచారణకు అనర్హమైనదిగా కొట్టివేయబడింది. నామినేషన్ తిరస్కరణలో ఉన్న స్పష్టమైన, సుస్పష్టమైన లోపాలను సరిదిద్దడానికి ఆర్టికల్ 32ను ప్రయోగించవచ్చని పిటిషనర్ చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది.






