చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఫర్నిచర్
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): చందానగర్ ప్రధాన రహదారిలో ఉన్న అను ఫర్నిచర్ దుకాణంలో(Anu Furniture Shop) గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఐదు అంతస్తుల్లో నిల్వ చేయబడిన ఫర్నిచర్ మొత్తం తగలబడింది.స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.
7 ఫైర్ ఇంజన్లు, 11 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.దుకాణం ఐదు అంతస్తుల భవనంలో ఉండటం, లోపల సోఫాలు, బెడ్‌లు, ఇతర వస్తువులు ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ లేదా ఇతర కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు,అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా ఘటన స్థలంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




