13 May, 2026 | 2:23 AM

శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

13-05-2026 12:17 AM
  1. బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం
  2. పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కార్యకలాపాలపై సీపీ చర్చలు

మంచిర్యాల, మే 12 (విజయక్రాంతి) : శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని, ఇందు కోసం అందరు సహకరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, అక్రమ ధాన్యం(వడ్లు) రవాణా, మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా మంగళ వారం సాయంత్రం మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అంతర్రాష్ట్ర పోలీస్ అధికారుల సమన్వయ సమావేశంలో మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ సరిహద్దు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై బక్రీద్ పండుగ సమయంలో ఆవుల అక్రమ రవాణా,

మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు తెలంగాణ  మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అక్రమంగా పశువుల రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, మహారాష్ట్ర వైపు నుంచి జరిగే పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చెక్పోస్టులు, నాకాబందీలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించే పశువుల మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా అక్రమ పశువుల రవాణాకు సహకరిస్తున్న ప్రభావశీల వ్యక్తులు, మద్దతుదారులపై ప్రత్యేక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల రవాణాదారుల కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మరోవైపు మహారాష్ట్ర వైపు అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా జరగకుండా వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

నాకాబందీలు నిర్వహించే సమయంలో సంబంధిత సరిహద్దు పోలీస్ స్టేషన్లకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. తెలంగాణ  మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పరస్పర సమాచార మార్పిడి, సమన్వయ చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవడానికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, సిరోంచా ఎస్డీపీవో సందేశ్ నాయక్, జైపూర్ సర్కిల్ సీఐ కె. నవీన్ కుమార్, శ్రీరాంపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్, చెన్నూర్ రూరల్ సీఐ ఆర్. కృష్ణ, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, తాండూర్ సర్కిల్ సీఐ దేవయ్య, కాగజ్నగర్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన సీఐ సంజయ్, కౌటాల సీఐ సంతోష్, జైపూర్ ఎస్‌ఐ ఎల్. భూమేష్, భీమారం ఎస్‌ఐ ఎ.రాజేందర్ పాల్గొన్నారు.