చెన్నైకి షాక్
లక్నో ఘనవిజయం
మార్ష్ విధ్వంసం
ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన జట్లు ఇప్పుడు మిగిలిన జట్లకు వరుస షాకులిస్తున్నాయి. మొన్న పంజాబ్‌కు ముంబై షాక్ ఇస్తే... ఇప్పుడు చెన్నై జోరుకు లక్నో బ్రేక్ వేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ విధ్వంసం సృష్టించిన వేళ 188 పరుగుల టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
లక్నో, మే 15 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అటు చెన్నై జట్టులో రెండు మార్పు లు జరిగాయి. ఓవర్టన్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్, అకిల్ హొస్సేన్ స్థానంలో గుర్జపనీత్ జట్టులోకి వచ్చారు. గత రెండు మ్యాచ్ లలో మంచి ఆరంభాలనిచ్చిన ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ ఈ సారి తడబడ్డారు.
సంజూ (20), రుతురాజ్ గైక్వాడ్ (13), ఉర్విల్ పటేల్ (6) నిరాశ పరిచారు. దీంతో సీఎస్కే 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కార్తీక్ శర్మ, బ్రెవిస్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా నాలుగో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీజన్ లో పెద్దగా అంచనాలను అందుకోలేకపోయిన కార్తీక్ శర్మ అదరగొట్టాడు.
భారీ షాట్లతో రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు బ్రెవిస్ (25) పరుగులకు ఔటవగా.. కార్తీక్ శర్మ 42 బంతుల్లో 71 (6 ఫోర్లు, 5 సిక్సర్లు) రన్స్ కు వెనుదిరిగాడు. మరో 4 ఓవర్లుండగా క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే మెరుపులు మెరిపించాడు. దూబే 16 బంతుల్లో 32 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్ , ప్రశాంత్ వీర్ 13 నాటౌ ట్ గా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా... షాబాజ్ అహ్మద్, షమీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తర్వాత ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ , జోస్ ఇంగ్లీస్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్ రెచ్చిపోయారు. ముఖ్యంగా మార్ష్ సీఎస్కే బౌలర్లను ఉతికారేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ల జోరుకు లక్నో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 86 పరుగులు చేసింది. ఈ క్రమం లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు ఇంగ్లీస్ కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 135 పరుగులు జోడించారు.
ఇంగ్లీస్ (36) పరుగులకు ఔటైనా.. మార్ష్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. పూరన్ తో కలిసి ధాటిగా ఆడాడు. సెంచరీ చేస్తానడుకున్న మార్ష్ 38 బంతుల్లో 90 (9 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. అబ్దుల్ సమద్ కూడా వెంటనే ఔటైనప్పటకీ పూరన్ (17 బంతుల్లో 32) సిక్సర్లతో రెచ్చిపోయాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన 17వ ఓవర్ లో పూరన్ వరుసగా 4 సిక్సర్లు బాదడంతో లక్నో మరో 20 బంతులు మిగిలుండగానే గెలిచింది.
స్కోరు బోర్డు
చెన్నై ఇన్నింగ్స్: 187/5 ( కార్తీక్ శర్మ 71, శివమ్ దూబే 32, బ్రెవిస్ 25, ఆకాశ్ 3/26, షమీ 1/41 )
లక్నో ఇన్నింగ్స్: 188/3 ( మార్ష్ 90, ఇంగ్లీస్ 36, పూరన్ 32 నాటౌట్, ముకేశ్ చౌదరి 1/24, స్పెన్సర్ జాన్సన్ 1/39 )






