ఆర్టీసీ బస్సును తప్పించబోయి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
తప్పిన పెనుముప్పు...
డ్రైవర్, క్లీనర్, బస్సు
ప్రయాణికులు సేఫ్..
నిజామాబాద్ జిల్లా బడా పహాడ్ శివారు ప్రాంతంలో ఘటన..
బాన్సువాడ, మే 3 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ శివారులో చింతలపేట తండా నుంచి మొక్కజొన్న లోడుతో నవీపేట మండలం అబ్బాపూర్ గోడౌన్కు వెళ్తున్న లారీ ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే చింతలపేట గ్రామస్తులు, రైతులకు సంబంధించిన 820 బస్తాల మొక్కజొన్న ధాన్యాన్ని లారీలో లోడ్ చేసి నవిపేట మండలంలోని అబ్బాపూర్ వద్ద ఉన్న గోడౌన్కు తరలిస్తున్నారు.
మార్గమధ్యలో బడాపహాడ్ శివారు వద్ద ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో, దానిని తప్పించబోయి లారీ అదుపుతప్పి పక్కకు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు, క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.లారీలో ఉన్న 820 బస్తాల మొక్కజొన్న రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మరో వాహనం ద్వారా ధాన్యాన్ని గోడౌన్కు తరలించే ఏర్పాట్లు చేశారు. రైతుల ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.






