29 March, 2026 | 5:10 AM

లాక్‌డౌన్.. తప్పుడు ప్రచారం

29-03-2026 01:45 AM
  1. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయి

ప్రజలు ఆందోళన చెందొద్దు

అన్ని దేశాలు ట్యాక్స్  పెంచితే భారత్ తగ్గించింది

రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని, లాక్‌డౌన్ అనేది ఉత్పన్నమే కాదని, లాక్‌డౌన్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నా రు. పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి మాట్లాడిన మాటలను తప్పు దోవ పట్టించారని, దేశంలో లాక్ డౌన్ వస్తుందేమోనని ప్రజలు కంగారు పడ్డారన్నారు.

ఇతర దేశాల నుంచి రావాల్సిన ఇంధనాన్ని వంద శాతం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనేక దేశాలు సుంకాలు పెంచుతుంటే, కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో రాష్ట్రంలో పెట్రోల్, డిజీల్, సీఎన్‌జీ, ఎల్పీజీ సరఫరా, లభ్యత, ప్రస్తుత పరిస్థితులపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్‌తో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు.

పెట్రోల్, డీజిల్ మీద తెలంగాణలో ఎక్కువ వ్యాట్ ఉందని, గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో వ్యాట్ శాతాన్ని తగ్గించలేదన్నారు. తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉండడంతో ఎక్సైజై డ్యూటీ తగ్గించినా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వ్యాట్ ని తగ్గించాలని కోరారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందన్నారు. కాంగ్రెస్ ఎందుకు పెట్రో ల్, డిజీల్ రేట్లు తగ్గించలేదన్ని ప్రశ్నించారు. యుద్ధం సమయంలో వచ్చిన పరిస్థితులను అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు.

చమురు కొరత ఉన్న సందర్భంలో వివిధ దేశాల్లో ధరలు పెరిగాయని, భారత్‌లో మాత్రం ప్రధాన మంత్రి ఎక్సైజ్ డ్యూటిని తగ్గించారన్నారు. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా అడ్డుకున్నారని, పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

క్రూడ్ ఆయిల్ కోసం ప్రధాన మంత్రి వివిధ దేశాలతో సంప్రదింపులు చేస్తున్నారని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో డీలర్లు ముందు వరుసలో ఉంటారని, దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. 8 ఏళ్ల క్రితం వంట గ్యాస్ కొందరు మాత్రమే వినియోగించే వారని, ప్రధాన మంత్రి ఉజ్వల్ కార్యక్రమం తర్వాత పేద వాళ్ల్లు సైతం గ్యాస్ ఉపయోగిస్తున్నారని తెలిపారు.

గ్యాస్ కోసం ఎవరూ డీలర్ల దగ్గరకు వెళ్లొదని, గతంలో మాదిరిగానే బుక్ చేసుకుంటే మీ ఇంటికే సిలిండర్లు వస్తాయన్నా రు. అందరికీ క్రెడిట్ సిస్టమ్‌లేదని, పెద్ద డీలర్లకు మాత్రమే క్రెడిట్ ఉందని, ఇప్పుడు కూడా డీలర్లకు మూడు రోజుల క్రెడిట్ ఇస్తున్నారని చెప్పారు. సీఎన్‌జీ కొరత లేదని, సాధారణంగానే సీఎన్‌జీ ఫిల్లింగ్‌కు సమ యం పడుతుందని, వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు.

బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మన దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.