7 April, 2026 | 9:32 PM

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం

07-04-2026 07:30 PM

సమ సమాజ స్థాపనలో యువత ముందుండాలి

ఏప్రిల్ 10వ తేదీన పూలే కాంస్య విగ్రహావిష్కరణ

జవహర్ నగర్ మహనీయుల ఉత్సవ కమిటీ

జవహర్ నగర్,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేసి సమ సమాజ స్థాపనలో జవహర్ నగర్ యువత ముందుండాలని, ఈనెల 10వ తేదీన జరిగే మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి జవహర్ నగర్ నుండే కాక జిల్లా నుండి పెద్ద ఎత్తున యువత తరలిరావాలని జవహర్ నగర్ మహనీయుల ఉత్సవ కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమానికి ప్రజలు మేధావులు, ప్రజాసంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో హాజరైనారు.

ఈ సందర్భంగా జవహర్ నగర్ మహనీయుల ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... భారతీయ సంఘసంస్కర్త, విద్యావేత్త ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు  బీజం నాటిన సామాజిక విప్లవయోధుడు, సత్య శోదక్ సమాజ్ స్థాపకుడు, వ్యవస్థాపకుడు, ఇల్లాలు చదువు... ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 10వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్ నగర్ లో కన్నుల పండుగగా జరుపుతున్నామని ఈ కార్యక్రమానికి సబ్బండ వర్గాల ప్రజలు, పెద్ద ఎత్తున తరలిరావాలని తద్వారా ఆ మహనీయుని ఆశయాల కనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కమిటీ సభ్యులు జవహర్ నగర్ లోని ప్రముఖులకు, పోలీసు అధికారులకు, అధికారులకు, నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.