చట్టం ఎవరికి చుట్టం కాదు
హుజూర్ నగర్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప
హుజూర్ నగర్: నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షార్హులేనని చట్టం ఎవరికి చుట్టము కాదని హుజూర్ నగర్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు అందులో పౌరుల హక్కులు విధుల గురించి పేర్కొనబడుతుందని ఆ చట్టంలో ఉండే అన్ని విషయాలు పౌరులకు తెలిసినట్లుగానే భావించాలని కూడా చట్టంలో పొందుపరచబడి ఉంటుందని అందువల్ల ఇది నేరం అని తెలియక తాము తప్పు చేశాము అంటే చట్టం మౌనంగా ఉండజాలదన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్స్ వినియోగానికి డ్రగ్స్ ను కలిగి ఉండటానికి దూరంగా ఉండాలని అలాగే సాంకేతికతను సన్మార్గానికి వినియోగించాలి తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించినట్లయితే శిక్షించబడతారన్నారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష మరియు మరణ శిక్ష సైతం విధించే అవకాశం ఉన్న పోక్సో, నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని అందువల్ల విద్యార్థులు నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు.
విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు ఆమె సూచించారు. కళాశాలలలో, విద్యా సంస్థలలో ర్యాగింగ్ కు పాల్పడిన వారికి 3 సంవత్సరముల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని అందువల్ల ఏ ఒక్కరు ర్యాగింగ్ కు పాల్పడ వద్దని ఆమె విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల డ్రగ్స్ రహిత కళాశాలగా రూపొందించిన పోస్టర్ ను న్యాయమూర్తి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సోమపంగు రామారావు,న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, ఎస్ఐ హనుమా నాయక్, సిబ్బంది,పాల్గొన్నారు.






