19 March, 2026 | 2:36 PM

లారిజానీ రోజుకో స్థావరం!

19-03-2026 12:00 AM
  1. 14 రోజులకుపైగా ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా తరచూ స్థావరాల మార్పు

అతని కుమార్తె ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థ

తక్షణమే ఆపరేషన్‌కు అనుమతించిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్

1,600 కి.మీ దూరంలో ఉన్న టార్గెట్‌పైకి యుద్ధ విమానాలు

వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, అతడి కుమారుడు మృతి

టెహ్రాన్, మార్చి 18: ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీని హంతం చేసి, ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది ఇజ్రాయెల్. యుద్ధం తొలిరోజున సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత టెహ్రాన్‌కు భారీస్థాయిలో నష్టం జరగడం మళ్లీ ఇప్పుడే. ఖమేనీ మరణం తర్వాత నుంచి ఇజ్రాయెల్‌కు చిక్కకుండా లారిజానీ అనేకసార్లు స్థావరాలు మారుస్తూ.. ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకున్నారు.

చివరికి అతని కుమార్తె ఇంట్లో ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థ గుర్తించింది. 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌పై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసి, అతడిని అంతమొందించింది. ఇరాన్‌లో అత్యంత ముఖ్యనేతగా లారిజానీకి పేరుంది. ఖమేనీ మరణం తర్వాత నుంచి ఇజ్రాయెల్ అతడిపై నిఘాపెట్టింది. కానీ, లారిజానీ జాడను గుర్తించడం అంత సులభమైన పనికాదు. ప్రత్యర్థులకు చిక్కకుండా దాక్కోవడంలో సిద్ధహస్తుడని లారిజానికి పేరు. అం దుకు తగ్గట్లుగానే రెండు వారాల నుంచి రహస్య ప్రాంతంలో ఉంటూ ఇరాన్ సై న్యాన్ని నడిపిస్తున్నారు.

నిఘా వర్గాలకు దొరక్కుండా తరచూ స్థావరాలు మార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో లారిజానీని ట్రాక్ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే అతడు కుమార్తె ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న నిఘావర్గాలు ఐడీఎఫ్ దళాలకు సమాచారమిచ్చా యి. అనంతరం ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఛేదించేందుకు యుద్ధ విమానాలను పంపారు.

అత్యంత పక్కా సమాచారంతో ఐడీఎఫ్ దళాలు లారిజానీ ఉన్న ప్రాంతంలో వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘటనలో లారిజానీతో పాటు అతడి కుమారుడు కూడా మృతి చెందాడు. ఇదిలాఉండగా.. లారిజానీ ఆపరేషన్ చేసిన సమయంలోనే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఒకే సమయంలో పూర్తిగా వేర్వేరు ప్రాంతాల్లో విజయవంతంగా దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. సాల్మనీ ఇటీవల ఇరాన్‌లో జరిగిన అల్లర్లను అణచివేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

ఇరాన్‌లో లారిజానీకి అత్యంత ప్రజాదరణ 

1958లో జన్మించిన లారిజానీ ఇరాన్‌లో అత్యంత ప్రజాదరణ గల రాజకీయ కుటుం బం నుంచి వచ్చాడు. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి కుడిభుజంగా వ్యవహరించిన ఆయన.. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకంగా పనిచేశాడు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా సేవలందించాడు. 2025లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత సెక్యూరిటీ చీఫ్ అయ్యాడు.

తాజా ఇజ్రాయెల్- దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తోన్న పోరాటంలో తమ సైన్యాన్ని సమన్వయం చేశాడు. ఖమేనీ మరణం తర్వాత.. సుప్రీం లీడర్‌గా మొజ్తా బా ఎన్నికైన సంగతి తెలిసిందే. మత సిద్ధాంతాల కారణంగా ఆయన నియామకాన్ని లారిజానీ వ్యతిరేకించినట్లు సమాచారం.