రైతులకు అవగాహన సదస్సు
24-07-2026 02:22 PM
- ఎల్‌నినో ప్రభావం, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్
- బోధన్,జూలై 24 (విజయక్రాంతి): సాలూర మండలంలోని రైతులకు ఎల్‌నినో ప్రభావం, అలాగే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అంశాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.., ఎల్‌నినో ప్రభావం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధికంగా కనిపించే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ సూచనలను నిరంతరం గమనిస్తూ పంటల యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచించారు.
- అనంతరం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) గురించి వివరించారు. ఈ మిషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం, స్థానికంగా లభించే వనరులతో తక్కువ ఖర్చుతో సాగు చేయడం, సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతులు జీవామృతం, ఘన జీవామృతం, మల్చింగ్ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎల్‌నినో ప్రభావం, ప్రకృతి వ్యవసాయంపై తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాలూర, ఖాజాపూర్, కొప్పర్తి క్యాంపు గ్రామాల సర్పంచ్‌లు, బోధన్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏ,డి,ఏ) బొబ్బ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి (ఏం,ఏ,ఓ), హుంసా, సాలూర వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏ,ఈ,ఓ లు) పాల్గొన్నారు.






