10 March, 2026 | 4:57 PM

ఉద్యానవనాలను శుభ్రంగా- ఆహ్లాదకరంగా ఉంచాలి

10-03-2026 02:17 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉద్యానవనాలను సందర్శించే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశుధ్య చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పిల్లల ఉద్యానవనంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవనాలను సందర్శించే వారికి స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తకుండీల్లో వేయాలని ప్రజలకు సూచించారు. ఉద్యానవనంలో ఉన్న మొక్కలు, గడ్డికి ఎండిపోకుండా ప్రతిరోజూ నీరు అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు.

ఉద్యానవనం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణంలో ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపట్టి చెత్తను తొలగించాలన్నారు. దోమల వ్యాప్తి నివారించేందుకు మందులు స్ప్రే చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి పట్టణాన్ని అభివృద్ధితో పాటు సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు వినోద్, స్వప్నరాణి, కృష్ణమ్మ, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.