20 April, 2026 | 3:49 AM

ఘనంగా కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం

20-04-2026 12:31 AM

మొయినాబాద్ ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు సూచించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు రెవెన్యూ పరిధిలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సత్యనారాయణ రెడ్డి వార్షిక నివేదికను ప్రవేశపెట్టి, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, ప్రపంచంలో సాంకేతిక విప్లవం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని తెలిపారు.

ఉద్యోగ అవకాశాలు పొందాలంటే నైపుణ్యం కీలకమని, కేవలం ఉద్యోగాల కోసం కాకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. ప్రతి ఏడాది లక్షలాది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్న నేపథ్యంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదని, సాంకేతిక పరిజ్ఞానంతో స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూచించారు.

కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల మాట్లాడుతూ, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేళాల ద్వారా పలువురు విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి మంచి వేతనాలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, బంగారు పతకాలు అందజేయగా, ఉత్తమ సేవలు అందించిన అధ్యాపకులను సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.