దమ్మపేట కోర్టులో మొక్కలు నాటిన జడ్జి భవాని
దమ్మపేట,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దమ్మపేట సివిల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ జడ్జ్ భవాని పిలుపునిచ్చారు . దమ్మపేట కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణంలో శుక్రవారం దమ్మపేట జడ్జి బొమ్మతి భవాని ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి భవాని మాట్లాడుతూ మొక్కల వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు , భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు పెద్ద ఎత్తున చెట్లను నాటాలన్నారు.
పర్యావరణ సమతుల్యత కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమన్నారు. పూర్వకాలంలో అడవులు అధికంగా ఉండటం వలన వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసేవన్నారు. ప్రస్తుతం చెట్లను విపరీతంగా నరికివేయటం వలన వర్షపాతం తగ్గి సకాలంలో వర్షాలు కురవటం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొంది మురళీమోహన్, న్యాయవాదులు మారం సతీష్ కుమార్, నల్లపు ఉదయ్ కుమార్, కాలం సంధ్యారాణి, గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.






