04-02-2026 02:12:19 AM
కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కి ప్రాధాన్యత ఇస్తూ, టికెట్లు కూడా సంజయ్ చెప్పిన వారికే ఇ చ్చారంటూ మంగళవారం జీవన్‌రెడ్డి ఘా టుగా విమర్శించారు.
జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలు ఉండగా ఇం దులో 30 టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్ వర్గానికి, 20 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో తన గొంతు కోశారని జీవన్‌రెడ్డి మంగళవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నేను చేసిన తప్పేంటి. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం తప్పా’ అని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పనిచేయడమే పాపమా అన్నా రు.
కష్టకాలంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉండటం నా బాధ్యత అన్నారు. ఇటీవల జగిత్యాలకు వచ్చిన మిత్రుడు ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అన్నారని, వారు ఇప్పుడు ఎందుకు మౌ నంగా ఉన్నారని నిలదీశారు. జగిత్యాలలో 2019 ఎన్నికలు మినహా అన్ని సందర్భాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసిందని, ప్రవాహానికి ఎదురీది జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలో కార్యకర్తలు పట్టుదలతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి అం డగా నిల్చున్నారని గుర్తు చేశారు.
అభ్యర్థులెవరైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అభ్యర్థుల జా బితా అందజేశానని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అని, ఇటీవల ఎమ్మెల్యే గాంధీ భవన్ మీటింగ్‌కు రావడంపైన కూడా తాను నిలదీశానన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కూర్చొబెట్టుకొని మున్సిపల్ ఎన్నికల టికెట్లపై చర్చించడం ఏమిటని, క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
పదేళ్లు కష్టపడిన కార్య కర్తల తినేకాడి పళ్లెం లాగితే ఆవేదన ఉండక ఏముంటుందని ప్రశ్నించారు. రాయికల్ లో ఏకాభిప్రాయంతో జాబితా ఇస్తే సగానికిపైగా జెండా పట్టని వారికి బీఫారాలు ఇచ్చారని, దీంతో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బరిలో నుంచి తప్పుకున్నారని అన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్‌గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలని గతంలో లేఖ కూడా రాశానని గుర్తు చేశారు.
కార్యకర్తలకు జరుగు తున్న అన్యాయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా జీవన్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం, పాత కాంగ్రెస్ కార్యకర్తలకు బీఫాం ఇవ్వకుండా పార్టీ మారిన వారికి టికెట్లు ఇచ్చారని ఆందోళనకు దిగడమే కాకుండా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడంతో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.