ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జేడీ ఆకస్మిక సందర్శన
అటానమస్ హోదాతో కళాశాల మరింత ఉన్నత స్థాయికీ తీసుకెళ్తుంది
లక్ష్మీదేవిపల్లి,(విజయక్రాంతి): కళాశాల విద్యా కమిషనర్ దేవసేన ఆదేశాల మేరకు సంయుక్త సంచాలకులు (జేడీ ) ప్రొఫెసర్ డి. ఎస్. ఆర్. రాజేంద్ర సింగ్ మంగళవారం శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల నమోదు, మౌలిక వసతులను పరిశీలించి కళాశాల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేడీ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. ఏఇడీపీ కోర్సుల్లో విద్యార్థుల నమోదును మరింత పెంచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమై, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా క్రమశిక్షణతో కృషి చేయాలని జేడీ సూచించారు. ‘జిజ్ఞాస’ స్టడీ ప్రాజెక్టుల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని జేడీ సూచించారు. పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజం, స్థానిక సమస్యలు, పర్యావరణం, సంస్కృతి తదితర అంశాలను అధ్యయనం చేసి వినూత్నమైన ప్రాజెక్టులను రూపొందించాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు.
బి ఏ కోర్సుల్లో అన్ని సీట్లు పూర్తిగా నిండడం, బి .కామ్ కోర్సులో 100 సీట్లకు విద్యార్థుల నమోదు పూర్తవడం పట్ల కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులను అభినందించారు. విద్యార్థులు కళాశాలపై చూపుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం కళాశాలలోని వివిధ తరగతి గదులను, విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా వసతులను, అధ్యాపకుల విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించిన జేడీ వాటి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు, సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






