12 August, 2026 | 10:19 AM

ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!

12-08-2026 09:09 AM

‘జాగ నాది.. నాది’ అంటూ రోడ్డుపైకి వచ్చిన వ్యాపారులు

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో(Bejjur Mandal Headquarters) ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. ‘జాగ నాది.. నాది’ అంటూ ఒకరిపై ఒకరు వాదించుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు ఇతర వ్యాపారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.బెజ్జూర్ ప్రధాన రహదారి పక్కన కొమురం భీం విగ్రహం ఎదుట ప్రభుత్వ స్థలంలో కూరగాయల వ్యాపారులు కొవిడ్‌ సమయం నుంచి తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ఎదుట ఉన్న దుకాణాలను తొలగించాలని ఆదివాసీ నాయకులు కోరడంతో వ్యాపారులు దుకాణాలను తొలగించారు.మంగళవారం తిరిగి దుకాణాలు ఏర్పాటు చేసుకునే సమయంలో స్థలం విషయంలో వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. అందరికీ సమానంగా స్థలం కేటాయించుకోవాలని కొందరు సూచించగా, ఒకరి స్థలాన్ని మరొకరు ఆక్రమిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో కొందరు వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఇతర వ్యాపారులు జోక్యం చేసుకుని పరస్పరం నచ్చజెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

బస్టాండ్ నిర్మాణానికి అడ్డంకిగా దుకాణాలు

బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం ఏళ్లుగా కలగానే మిగిలిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల దుకాణాలను తొలగించి ప్రత్యామ్నాయ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బస్టాండ్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. బస్టాండ్ నిర్మాణానికి ఆర్యవైశ్య సంఘం ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎంపీ  నాగేష్ సైతం బస్టాండ్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.ఆర్టీసీ డిపో మేనేజర్ పలుమార్లు బెజ్జూర్‌కు వచ్చి స్థలం ఖాళీ చేసి, గ్రామపంచాయతీ నుంచి తీర్మానం చేసి ఇస్తే బస్టాండ్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపినట్లు వెల్లడించారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా ముందుకు వచ్చి సహకరిస్తేనే బస్టాండ్ నిర్మాణం సాధ్యమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

నోటీసులు ఇస్తాం...

కూరగాయల దుకాణాలు ప్రభుత్వ స్థలంలోనే కొనసాగుతున్నాయని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలను తొలగించేందుకు నోటీసులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.బస్టాండ్ లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బెజ్జూర్‌వాసులు కోరుతున్నారు.