ఉద్యమ స్ఫూర్తి జయశంకర్ సార్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారును తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయులు తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ఆయన అందించిన విశిష్ట సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ స్వప్నాన్ని ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలుగా మార్చుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని సీఎం అన్నారు. తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే లక్ష్యంగా ఆ మహనీయు డు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ప్రజలు ఎదుర్కొన్న వివక్షను గణాంకాలతో సహా దేశానికి వివరించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు.






