కేటీఆర్ ను కలిసిన జేఏసీ నాయకులు
డంపింగ్ యార్డ్ తో ఇబ్బంది పడుతున్న ప్రజల పక్షాన సీఎంకు లేఖ రాస్తానని హామీ
దమ్మాయిగూడ/జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల పక్షాన పోరాడుతున్న జేఏసీ బృందం శనివారం నాడు బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను కలిసి డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న అశాస్త్రీయ విధానాలు , సుమారు 20 లక్షల మంది జనాల ఉసురుతీస్తున్న రామ్ కి సంస్థ యాజమాన్యం గురించి వివరించారు. లక్షల టన్నుల్లో చెత్తను పోగుచేసి సెగ్రీగేట్ చేయకుండా, బయోమైనింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా 339 ఎకరాలలో చెత్త కుప్పతో నింపి నేల కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం సృష్టిస్తుంది.
ఇట్టి పరిస్థితుల్లో కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి ప్రజలను అనారోగ్య బారిన పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఈ నెల నాలుగవ తేదీన జేఏసీ బృందం కలిసి వాస్తవ పరిస్థితులు తెలియజేయడం జరిగింది. అందుకు సీఎం అఖిలపక్షంలో నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే ఏ పార్టీ వారు వ్యతిరేకించకూడదని , కొత్త టెక్నాలజీ తో డంపింగ్ యార్డ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ,జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణ, ఇక అక్కడ చెత్త వేయడానికి స్థలం లేనందున సీఎం రేవంత్ రెడ్డి కి లేఖను రాసి ప్రజల పక్షాన నిలుస్తానని హామీ ఇచ్చారు.
GHMC పరిధిలోని మొత్తం చెత్తను ఒకే చోటికి తరలించడం మానుకోవాలని, గంటకు 5.9 టన్నుల మీథేన్ గ్యాస్ విడుదల కావడం ఆందోళనకర విషయమని, ప్రపంచంలోని చెత్తగుట్టలలో మన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నాలుగవ స్థానానికి రావడం , అదేవిధంగా ఆశాస్త్రీయ చెత్త నిర్వహణలో భారతదేశ డంపింగ్ యార్డులలో మొదటి స్థానం కలిగి ఉండడం బాధాకరం. ప్రజలు జీవించే హక్కును కోల్పోవడం క్షమించరాన్ని నేరముగా గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని మరియు కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు కు వెంటనేపూనుకోవాలని జేఏసీబృందం డిమాండ్ చేసింది.






