27 March, 2026 | 1:38 AM

భలే భద్రగిరి మార్ట్!

27-03-2026 12:00 AM

అటవీ వస్తువులు లభ్యం 

గిరిజన ఉత్పత్తుల మార్కెట్ 

గ్రామీణ జీవనోపాధికి సాధికారత 

ఐటీడీఏ పీవో రాహుల్ మరో నూతన ఆవిష్కరణ 

- భద్రాచలం, మార్చి 26, (విజయక్రాంతి): భద్రాచలంలో గిరిజన మ్యూజియం హాట్ టాపిక్. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు సజీవ సాక్ష్యం.ఇక ఇప్పుడు గిరిజన ఉత్పత్తులకు భద్రాచలం మార్కెట్ కానుంది. అదే భద్రగిరి మార్ట్. ”నూతన ఆవిష్కరణల ఆఫీసర్‌” గా పేరొందిన భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్ మరో అద్భుత సృష్టి భద్రగిరి మార్ట్. గ్రామీణ జీవనోపాధికి సాధికారత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ మార్ట్ నెలకొల్ప బడింది.గిరిజన స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను ప్రోత్సహించటం, మార్కెటింగ్ చేయటం ఈ గిరి మార్ట్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

 భద్రాచలంలో గిరి మార్ట్ ..

భద్రాచలం పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో భద్రగిరి గిరిమార్ట్ ను ఏర్పాటు చేశారు. గతంలో గిరిజన బజారుగా ఉన్న భవనాన్ని అందచందంగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ఐటీడీఏ నిధులను వెచ్చించింది. పట్టణాలకు మాత్రమే పరిమితమైన వివిధ రకాల  మార్ట్ లు భద్రాచలంలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఐటిడిఏ పిఓ బి. రాహుల్ ఐఏఎస్ భావించారు. నూతన వ్యవస్థల సృష్టికర్తగా పేరుందిన రాహుల్ ఐఏఎస్ భద్రగిరి మార్ట్ కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఐటీడీఏ అధికారుల,ఉద్యోగుల సేవలను వినియోగించారు. గిరిజన మార్ట్ లో సకల సౌకర్యాలు కల్పించారు. అద్భుతంగా భవనాన్ని తీర్చిదిద్దారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ భద్రగిరి మార్ట్ స్థానికులకు ఎంతగానో ఉపకరించనుంది 

గిరిజన ఉత్పత్తుల మార్కెట్ : 

భద్రాచలంలో భద్రగిరి మార్ట్ ఏర్పాటు అద్భుతమనే చెప్పాలి. అడవిలో దొరికేటువంటి ప్రయోజనకరమైన ఎన్నో రకాల అవసర వస్తువులు ఇక్కడ లభ్యం కానున్నాయి. గిరిజన ఉత్పత్తులు, స్వయం సహాయక బృందాల ఉత్పత్తులు, సాధారణ వస్తువులు, వెదురు వస్తువులు, అటవీ తేనే, అడవి పసుపు, పచ్చళ్ళు,స్నాక్స్, హస్తకళలు, హెర్బల్ సబ్బులు, కిరాణా వస్తువులు, చిరుధాన్యాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు ఇలా అనేక ప్రజా ఉపయోగకర వస్తువులు ఇక్కడ లభించనున్నాయి.ఈ వస్తువులకు సరసమైన ధరలను కేటాయించి వీటిని విక్రయించేలాగా చర్యలు చేపట్టారు. శ్రీరామనవమి రోజు నుంచి భద్రగిరి మార్ట్ స్థానికులకు అందుబాటులోకి రానుంది.

రాహుల్ మరో నూతన ఆవిష్కరణ ఇది ... 

భద్రాచలంలో ఐటీడీఏ పీవో రాహుల్ గాంధీ అధికారం చేపట్టినప్పటి నుంచి గిరిజన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు.భద్రాచలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు ద్వారా గిరిజన సంస్కృతిని సజీవంగా కాపాడగలిగారు. ట్రైబల్ మ్యూజియం ఒక పిక్నిక్ స్పాట్ గా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో యాత్రికులు ట్రైబల్ మ్యూజియాన్ని దర్శిస్తున్నారు. ఇది ఐటీడీఏకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. గిరిజనుల తమ ఇలవేల్పుల చరితను వెలికి తీసేందుకు రాహుల్ ప్రత్యేక బృందాలతో గిరిజనుల చరితను తెలిపే పుస్తకాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. తెలుగు భాష ఉన్నతికి ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు.

ఉద్దీపకం పుస్తకం ద్వారా గిరిజన బిడ్డల ఆంగ్ల విద్య ప్రోత్సాహానికి విశేషమైన కృషి చేశారు. ఇలా విద్యారంగానికి పెద్దపీట వేస్తూనే...మరోవైపు గిరిజనుల వ్యవసాయ ప్రగతికి కూడా చర్యలు చేపట్టారు.అంతేకాకుండా వారు పండించిన పంటలకు, అడవుల్లో దొరికే ఉత్పత్తులకు మార్కెట్ ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో భద్రగిరి మార్టును ఏర్పాటు చేసి మరో నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని సక్సెస్ చేయడం కోసం పిఓ రాహుల్ అహర్నిశల కష్టపడ్డారు. ఈ మార్ట్ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం కలగనుంది. భద్రాచలానికి వన్నె తెచ్చే విధంగా అనేక నూతన ప్రయత్నాలకు, సక్సెస్ కు వారధిగా నిలుస్తున్న ఐటీడీఏ పిఓ రాహుల్ ఐఏఎస్ ను తప్పకుండా అభినందించాల్సిందే.