అంతా శివనామస్మరణే
భక్తి పారవశ్యంలో సరస్వతి అంత్య పుష్కరాలు
- ఆరవ రోజు భక్తుల పుణ్యస్నానాలతో కళకళలాడిన కాళేశ్వరం తీర్థ ఘాట్లు
- దేవాదాయ శాఖ కమిషనర్ పుష్కర స్నానం
కాళేశ్వరం/మహబూబాబాద్, మే 26 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో ఆరో రోజు భక్తి భావం ఉట్టిపడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్ల వద్ద వేద మంత్రో చ్ఛారణలు, హారతులు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అలంకరించాయి. మహి ళలు దీపారాధనలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పుష్కర క్షేత్రం భక్తజన సందోహంగా మారింది.
అన్నదాన కార్యక్రమాలు, తాగునీటి సదుపాయాలు, వైద్య శిబిరాలు భక్తులకు అందుబాటులో ఉంచగా, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి రద్దీని సమర్థంగా నియంత్రించారు. సరస్వతి నది సంగమక్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కాశీ పండితులు నవరత్న హారతి సమర్పించారు.
కాగా త్రివేణి సంగమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పుష్కర స్నానం ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు కాళేశ్వరం మెగా విశ్రాంతి భవనంలో గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందిన భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లు రాహుల్ శర్మ, బోర్ఖడే హేమంత్ సహదేవరావు, దీపక్ కుమార్, సత్య ప్రసాద్, కోయ శ్రీ హర్షలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎదురైన లోటుపాట్లను గుర్తించి, గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎడిసి ఎం.కృష్ణవేణి, ఆర్ జేసీ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ ఆర్. సునీత, ఆలయ ఈవో ఎస్. మహేష్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల అదనపు కలెక్టర్లు బుజంగరావు, వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం ఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు.
మ్యూజియంను సందర్శించిన కలెక్టర్లు
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చొరవతో ఏర్పాటు చేసిన శిలా సం పద మ్యూజియంను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు బొర్క డే హేమంత్ సహదేవరావు, కుమార్ దీపక్, కోయ శ్రీహర్ష, సత్య ప్రసాద్ సందర్శించారు. మ్యూజియంలో భద్రపరచిన శిలా సంపదను వారు ఆసక్తిగా పరిశీలించారు. పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి, మ్యూజియంలో ఉన్న శిలా విగ్రహాల చారిత్రక ప్రాధాన్యత, శిల్పకళా విశిష్టతను వివరించారు.
అనంతరం కలెక్టర్ల బృందం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించింది. తదనంతరం దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ కలెక్టర్లకు శేషవస్త్రాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం సరస్వతి ఘాట్లో నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.






