9 April, 2026 | 4:24 AM

17 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

09-04-2026 12:30 AM
  1. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
  2. సెన్సెక్స్2,964, నిఫ్టీ 874 పాయింట్ల పెరుగుదల
  3.   0.47 పైసలు పెరిగి కోలుకున్న రూపాయి

ముంబై, ఏప్రిల్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బుధవారం అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో స్టాక్ మార్కెట్ పుంజుకుంది. సెన్సెక్స్ 2,946 పాయింట్లు (3.95 శాతం) పెరిగి 77,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78శాతం) పెరిగి 23,997 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లు పెరిగింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.59గా 0.47 పైసలు పెరిగి కోలుకుంది. సీజ్ ఫైర్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశం ఉండడం మార్కెట్‌ను బలపర్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర 16 శాతం తగ్గి 95.06కు పడిపోయింది. అనేక అనిశ్చితులున్నా ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచకపోవడం కూడా దేశీయ మార్కెట్ లాభాలకు కారణమయ్యాయి.

లాభాల్లో ఆసియా మార్కెట్లు..

మరోవైపు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఆసియా మార్కెట్లను కూడా లాభాల్లో ముంచెత్తింది. దక్షిణ కొరియా కోస్పి సూచీ 6.87శాతం పెరిగి 5,872 వద్ద ముగిసింది. జపాన్ నిక్కీ 5.39శాతం పెరిగి 56,308 వద్ద ముగిసింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 3.09శాతం పెరిగి 25,893 వద్ద ముగియగా, చైనా షాంఘై కాంపోజిట్ 2.69శాతం పెరిగి 3,995 వద్ద ముగిసింది.