15 August, 2026 | 4:31 AM

కేజీబీవీలోఅంతర్గత కుమ్ములాటలు!?

15-08-2026 12:42 AM

గాడితప్పిన నిర్వహణ 

కేసముద్రం, ఆగస్టు 14 (విజయక్రాంతి): కేసముద్రం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్య అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సరైన ఆజమాయిషి కరువైందని, పరస్పరం సమన్వయం లేకుండా పోయిందని, ఎవరికివారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఎవరైనా కలగజేసుకుంటే వారిపై లేనిపోని అబాండాలు వేస్తూ, కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎవరేం తప్పు చేస్తారా.. అంటూ వారి తప్పులను వెతుకులాడడం కోసం ఎవరికివారు ప్రత్యేకంగా కాచుకూర్చుంటు న్నారని, విద్యాలయ అంతర్గత విషయాలను రికార్డు చేస్తూ ఇతరులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిపై ఒకరు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ, ఉన్నతాధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేసు కుంటున్నారని విమర్శలు ఇటీవల మరి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఎస్‌ఓ గా పనిచేసిన విధి నిర్వహణ సరిగా చేయలేదని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తనిఖీలో గుర్తించి ఆమెను ఈ విద్యా సంవత్సరం నుంచి విధులకు దూరంగా ఉంచారు.

ప్రస్తుతం కేజీబీవీ కేసముద్రం ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్ గా సిఆర్టి అర్చనకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇందులో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పై ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ కర్ర పెత్తనం చలాయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీనితో ఆమె ఏం తప్పు చేస్తుందా అంటూ సిబ్బంది కొందరు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. నాన్ టీచింగ్ స్టాఫ్ లో ఒకరిపై ఇంచార్జ్ ఎస్‌ఓ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమెను మందలించడంతో కక్ష పెంచుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇందులో భాగంగానే కేజీబీవీ లో విద్యార్థుల చేత క్లాస్ రూమ్, డార్మెట్రీలో జడ వేయించుకుంటున్న ఇన్చార్జి ఎస్‌ఓ వీడియోలు బయటకు రావడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఈ అంశం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేజీబీవీ కేసముద్రంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్య సయోధ్య లేదని, దీనితో పాఠశాల, హాస్టల్ నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్య సయోధ్య లేకపోవడంతో విధుల నిర్వహణ కూడా సరిగా లేదని, కొందరు టీచింగ్, మరికొందరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనితో పేద విద్యార్థులకు చక్కని విద్యాబోధన, వసతి, భోజన సదుపాయం సరిగా అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అస్తవ్యస్తంగా మారిన కేజీబీవీ కేసముద్రం పాఠశాల నిర్వహణను సరైన గాడిలో పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.