23 March, 2026 | 4:47 PM

అంతకంతకు ఉధృతం

22-03-2026 12:00 AM

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల అంతకంతకూ విస్తరించుకు వెళ్తున్నది. మూడు వారాల నుంచి రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయాలకు పెద్ద సవాల్‌గా పరిణమించింది. ఇజ్రాయెల్‌తోపాటు తన సంయుక్త దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని అగ్రరాజ్యం భావిస్తున్న తరుణంలో, తాజాగా ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు కొత్త సమీకరణాలకు తెరలేపాయి.

హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మక అమెరికా - యూకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం యావత్ ప్రపంచానికి చెందిన రక్షణ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. చాగోస్ దీవుల సముదాయంలోని ఈ డిగో గార్సియా అమెరికన్ బాంబర్లు, బలమైన నిఘా విమానాలకు ప్రధాన వేదిక. అలాంటి కీలక కేంద్రంపైకి క్షిపణులు దూసుకురావడమంటే ఇరాన్ తన పరిధిని పశ్చిమాసియా ఆవల కూడా విస్తరించిందని అర్థం చేసుకోవాలి.

ఇప్పటివరకు ఇరాన్ తన క్షిపణుల పరిధి కేవలం 2 వేల కిలోమీటర్ల లోపేనని బహిరంగంగా ప్రకటించినప్పటికీ, 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నించడం ఆ దేశం వద్ద ఉన్న రహస్య యుద్ధ సామర్థ్యాన్ని చాటిచెబుతున్నది. తనకు తానే అజేయశక్తి అని భావించే అమెరికా అత్యాధునిక ఎఫ్ యుద్ధ విమానం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ధాటికి కుప్పకూలిపోవడం, రాడార్లకు చిక్కని సాంకేతికత సైతం విఫలం కావడం వాషింగ్టన్ వర్గాలకు మింగుడుపడని వాస్తవం.

ఇరాన్ నౌకాదళం, వాయుసేన పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆ దేశ పాలకులు అణ్వాయుధ కలలు కనలేరని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. యుద్ధం ప్రారంభమై నాటి నుంచి, ఇప్పటివరకు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్‌తో పాటు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల ఇంధన క్షేత్రాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. ముఖ్యంగా కువైట్ లోని అతిపెద్ద మినా అల్-అహ్మదీ రిఫైనరీపై జరిగిన దాడులు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పవిత్ర ఈద్ ఉల్- ఫితర్ పండుగ వేళ కూడా దాడుల ప్రకంపనలు ఆగకపోవడం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతున్నది. హోర్మూజ్ జలసంధి మూసివేతతో, ఎన్నో దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో 22 దేశాలు ఏకమై ఈ దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్‌కు విజ్ఞప్తి చేయడం అంతర్జాతీయ ఒత్తిడిని సూచిస్తున్నది. అయితే, ఇరాన్ మాత్రం తన పొరుగు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నది.

తమపై దాడులకు అమెరికా స్థావరాలను అనుమతిస్తే ఆయా దేశాలు కూడా యుద్ధంలో భాగస్వాములైనట్లే పరిగణిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు, నాటో కూటమి దేశాలు తనకు సహకరించడం లేదని, అవి పిరికిపందల్లా వ్యవహరిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామా జిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తం చేయడం మిత్రదేశాల మధ్య నెలకొన్న అంతరాన్ని బయటపెడుతున్నది.

ఇరాన్‌లోని క్షిపణి తయారీ కేంద్రా లను పెకిలించామని ఇజ్రాయెల్ చెబుతున్నది.  కానీ, ఇరాన్ మాత్రం తన అమ్ముల పొది నుంచి ఒక్కో అస్త్రం తీస్తూ బలమైన కౌంటర్ ఇస్తుండటం గమనార్హం. పశ్చిమాసియా వైపు అమెరికా  మరిన్ని యుద్ధ నౌకలను, వేల సంఖ్యలో నౌకాదళ సిబ్బందిని తరలిస్తుండటంతో పోరు మున్ముందు ఏ మలుపు తిరుగుతుందోనన్న భయం గల్ఫ్ దేశాలను పట్టిపీడిస్తున్నది.