కాప్రా చెరువు సుందరీకరణ పనుల పరిశీలన
ఉప్పల్, ఆగష్టు5 (విజయక్రాంతి) : కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువును ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నవీన్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బీరప్పగడ్డ డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బీరప్పగడ్డ డివిజన్లోని శ్రీ సాయిరాం నగర్ కాలనీ, ధర్మపురి కాలనీ, శ్రీనగర్ కాలనీలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మెయిన్ మంచినీటి పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ కాలనీల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.






