19 June, 2026 | 9:59 PM

ప్రభుత్వ బడుల బలోపేతానికి సుద్దాల గ్రామ పంచాయతీ వినూత్న చర్యలు

19-06-2026 08:59 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటేలి నాగరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపుతో పాటు సాయంత్రం వేళ విద్యార్థులకు స్నాక్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో 34 మంది కొత్త విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.విద్యార్థుల సౌకర్యార్థం ఆటో రవాణా సదుపాయం కల్పించడంతో పాటు, నాణ్యమైన విద్య అందించేందుకు ఇద్దరు వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం ఒక గంట స్టడీ అవర్ నిర్వహించి, అనంతరం స్నాక్స్ అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.వ్యవసాయ పనుల నిమిత్తం తల్లిదండ్రులు ఇంటికి చేరే వరకు విద్యార్థులు పాఠశాలలో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.