"గాట్స్ 2004" ఒప్పందంతోనే విద్యావ్యవస్థ వినాశనం
పీడీఎస్ యూ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కన్నా
కొత్తపేట లోని బీజేఆర్ భవన్ లో పీడీఎస్ యూ
రాష్ట్ర విద్యా ,వైజ్ఞానిక శిక్షణా తరగతులు
ఎల్బీనగర్: భారతీయ విద్యావ్యవస్థలో గాడ్స్ ఒప్పందమే విద్యావ్యవస్థ వినాశనానికి కారణమైందని, విద్యను వ్యాపార సరుకుగా మార్చే గాట్స్ ఒప్పందం నుంచి భారత్ బయటకు రావాలని పీడీఎస్ యూ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.విజయ్ కన్నా డిమాండ్ చేశారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట బీజేఆర్ భవన్ లో జరిగిన పీడీఎస్ యూ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతుల్లో భాగంగా రెండోరోజు విజయ్ కన్నా హాజరై విద్యారంగ ప్రస్తుత పరిస్థితులు, విద్యార్థుల కర్తవ్యాలు అనే అంశంపై ప్రసంగించారు. విద్యను వ్యాపార సరుకుగా మార్చే జనరల్ అగ్రిమెంట్ ఆమ్రేడ్ ఇన్ సర్వీసెస్ గాడ్స్ ఒప్పందం నుండి భారత్ బయటకు రావాలన్నారు.
2004 జెనీవాలో జరిగిన గాడ్స్ ఒప్పందంతో దేశ విద్యారంగంలోకి విచ్చలవిడిగా విదేశీ ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయని, ఈ విధానం మూలంగా విద్య మరింత వ్యాపార మయం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో భారతదేశ సామాజిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని ఫలితంగా అంతరాలు పెరిగి సామాజిక సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర ఏళ్లుగా విద్యార్థులకు , నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని, ఇప్పటికీ ప్రకటిస్తామన్న రెండున్నర లక్షల జాబ్ క్యాలెండర్ ఊసే లేదని విమర్శించారు. విద్యా భరోసా కార్డు హామీ ఇంకా నెరవేర్చలేదని, దాదాపు రూ, 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు పేరుతో 27వేల ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయడంతో ఆదివాసి, గిరిజన, నిరుపేద విద్యార్థులకు విద్యను అభ్యసించే హక్కును కోల్పోనున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ కళాశాలలను, యూనివర్సిటీల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రశ్నించినందుకు విద్యార్థి యువతను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని విద్యార్థులు నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.భాస్కర్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సరళ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.విజయ్, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్ గణేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సతీశ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.బి. వంశీ కుమార్ పాల్గొన్నారు.






